↧
ప్రభుత్వాలూ వారికి మద్దతునిస్తాయి. ఒక సంస్థలో కొత్త కార్మికుడు లేదా ఉద్యోగి అవసరమని కార్మిక మంత్రిత్వ శాఖ గుర్తించి, హోం మంత్రిత్వ శాఖకు నివేదిస్తుంది. ఆ నివేదనకు అనుగుణంగా హోం శాఖలోని ఇమ్మిగ్రేషన్ విభాగం వీసాను జారీ చేస్తుంది. ఆ వీసా ప్రకారం గల్ఫ్ దేశంలోకి అడుగిడిన విదేశీ ఉద్యోగి లేదా కార్మికుడు, తిరిగి స్వదేశానికి వెళ్ళేంతవరకు తన యజమానికి విధేయుడై ఉండాలి.
యాజమాని మాట శాసనం. ప్రభుత్వం అతనికి దన్నుగా ఉంటుంది. న్యాయబద్ధంగా తనకు దక్కవలసిన వేతన భత్యాలు దక్కినా దక్కకపోయినా యజమాని అనే వ్యక్తికి బద్ధుడై ఉండటం విదేశీయుడికి అనివార్యం. ఒకవేళ సదరు విదేశీ ఉద్యోగి తన యజమాని నుంచి పారిపోయి వేరేచోట ఉద్యోగం సాధించుకుంటే దాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఇలాంటివారు స్వదేశాలకు వెళ్ళిపోవడానికి నిషిద్ధులు. యజమాని నుంచి పారిపోయినందుకు జైలు శిక్షపడుతుంది. జరిమానా కూడా చెల్లించవలసి ఉంటుంది.
మహారాష్ట్ర చెరుకు తోటల కూలీలు లేదా పంజాబ్ వరి కోత యంత్రాల ఆపరేటర్లకు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న స్వేచ్ఛ ఇక్కడ భారతీయులకు గానీ, ఇతర విదేశీయులకు గానీ లేదు. గల్ఫ్ దేశాలలో యజమానుల నుంచి పారిపోయే విదేశీయులలో భారతీయులు అందునా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అగ్రగణ్యులు. ‘గల్ఫ్ సహకార మండలి’లోని ఆరుసభ్య దేశాలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఒకటి. ఈ దేశం ఏడు ఎమిరేట్‌ల సమాఖ్య. దుబాయి వీటిలో ఒకటి. అధిక వేతనం కోసం యజమానుల నుంచి పారిపోయే వారి సంఖ్య దుబాయిలోనే ఎక్కువ. సందర్శక వీసాలపై వచ్చి ఇక్కడే ఉండిపోయిన వారు కూడా కొంతమంది ఉన్నారు.
వీరందరూ స్వదేశానికి వెళ్ళిపోవడం అంత సులువు కాదు. ఈ విషయంలో మన దౌత్యవేత్తలు కూడా వారికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేరు. యుఏఇ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఇటువంటివారికి క్షమాభిక్ష ప్రసాదించడానికి పూనుకొంది. ఇందుకొక పథకాన్ని ప్రకటించింది. డిసెంబర్ 4 నుంచి ఇది అమలవుతోంది. ఫిబ్రవరి 3 వరకు కొనసాగనున్నది.
ఈ క్షమాభిక్ష వల్ల దాదాపు వీసా నిబంధనలు ఉల్లంఘించిన 40వేల మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వెళ్లగలరని అధికారులు తొలుత అంచనా వేశారు. అయితే మొత్తం సంఖ్య 20వేలకు మించడం లేదు. పాస్‌పోర్టులు తమ వద్దే ఉన్న వారు నేరుగా లాం ఛనాలు పూర్తి చేసుకొని విమానాశ్రయానికి వెళ్తున్నారు. దీంతో ఇటువంటి వారి గురించి మన దౌత్యకార్యాలయాలకు ఎటువంటి సమాచారం అందడంలేదు. కేవలం తమ యజమానుల నుంచి పారిపోయి, పాస్‌పోర్టులు లేనివారు, ఔట్ పాస్‌లకై వస్తున్న వారి వివరాలు మాత్రమే మన దౌత్య కార్యాలయాలకు అందుతున్నాయి.
క్షమాభిక్షను ఉపయోగించుకొనే తమ రాష్ట్ర వాసులకు, స్వదేశానికి రావడానికి ఉచిత విమాన టిక్కెట్లు సమకూర్చుతామని కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే నిబంధనల కారణంగా ఈ ఉచిత టిక్కెట్ల వ్యవహారంలో జోక్యంచేసుకోలేమని మన విదేశాంగ శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో తన మాటను నిలబెట్టుకోవడానికి కేరళ ప్రభుత్వం అవస్థలు పడుతోంది. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చితే వీసాలేని మలయాళీల సంఖ్య తక్కువ.
యూఏఈలోని వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన లేని తెలుగు పాత్రికేయులు తమకు తోచిన విధంగా వార్తలు రాస్తూ గందరగోళం సృష్టిస్తున్నారు. గల్ఫ్ దేశాలలోని ప్రవాసాంధ్ర సమాజంలో ఒక కొత్త పరిణామం- పలువురు నాయకుల ఆవిర్భావం. తామే అసలు నాయకులమంటూ ఈ కొత్త నేతలు ప్రతిరోజూ మన దౌత్యవేత్తల ముందు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేస్తున్నారు. తెలుగువారు నవ్వులపాలవ్వడం మినహా వారు సాధిస్తున్నదేమీ లేదు. గల్ఫ్ దేశాలలో ఉపాధికి వచ్చిన వారు, ఆంధ్రప్రదేశ్‌లో యజమాని పిలిపించిన తరువాత వచ్చి తమ ఇష్టానుసారం పనిచేసే మహారాష్ట్రియన్ చెరుకు కోత కూలీల వలే వ్యవహరించడం కుదరదు. తాము అతిథులం మాత్రమేనని, ఆ ఆతిథ్యానికి కాలపరిమితి ఉందన్న వాస్తవాన్ని వారు గుర్తుంచుకోవాలి.
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)